Rayachoti : రాయచోటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ – ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి వెల్లడి

0
172

మనఛానల్ న్యూస్ – రాయచోటి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణాన్ని శరవేగంగా అభివృద్ది పథంలో నడిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ ఎంతో చొరవ తీసుకొంటున్నారని, దీనికనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి పట్టణం రూపురేఖలు మార్చుతామని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారంమున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్ బాష అధ్యక్షతన జరిగిన
రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోని ప్రసంగించారు.

జిల్లా కేంద్రమైన రాయచోటి చుట్టుపక్కల గల ప్రభుత్వ భూముల పరిరక్షించడం, వాటిని ప్రజావసరాలకే వినియోగించేలా చూడడం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ప్రజలకు అన్ని వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. రాయచోటికి సమీపంలోని దిగువ అబ్బవరం వద్ద 26 ఎకరాల ప్రభుత్వస్థలాన్ని స్టేడియం నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టామన్నారు. దీని ద్వారా భావి క్రీడాకారుల కోసం స్టేడియం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

మున్సిపల్ సమావేశంలో పాల్గోన్న కౌన్సిలర్లు

మున్సిపల్ పరిధిలోని ఎగువ అబ్బవ రం వద్ద 76 ఎకరాల భూమిలో నగరవనం కింద పార్కు నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే కంచాలమ్మ చెరువులో పర్యాటకులకు బోటింగ్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పట్టణంలో మైనార్టీ సోదరులకోసం షాదీఖానా , నిర్మాణానికి భూసేకరణ, వివిధ ప్రాంతాలలో స్మశానవాటికల కోసం ప్రహరిగోడల నిర్మాణం పనులను రూ. 42లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నారాయణరెడ్డిపల్లె జగనన్న కాలనీకి బిటిరోడ్డు నిర్మాణం, ఎంఐజి లేఔట్ కు అవసరమైన ప్రతిపాదనలు సక్రమంగా తయారు చేయడం లేదంటూ మున్సిపల్ డీఈ సుధాకర్ నాయక్ పైఎమ్మెల్యే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని వీధులలో జరగాల్సిన భూగర్భ డ్రైనేజిపనులు జనసంచారం లేని ప్లాట్లలో చేపడుతున్నారంటూ కౌన్సిలర్ కొలిమి హరూనా భాష ఆరోపించారు.

జనసంచారం ఉన్న కొత్తపల్లె ప్రాంతంలో మొదటగా పనులు జరిపించాలంటూ ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ త్వరలో కొత్తపల్లెలో భూగర్భ డ్రైనేజి పనులు ప్రారంభింప చేస్తామన్నారు. కౌన్సిలర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ కౌన్సిలర్ హారూన్ కోరారు. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాక్యూమ్ క్లీనర్ నిరుపయోగంగా ఉందని, వెంటనే వినియోగంలోకి తేవాలని కౌన్సిలర్లు సాదక్ అలీ, నరసింహరెడ్డి, హారూన్ బాష తదితరులు కమిషనర్ ను కోరారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే వాక్యూమ్ క్లీనర్ కు మరమ్మతులు చేయించి పట్టణంలోని ప్రధాన రోడ్లను శుభ్రపరిచేందుకు వినియోగించాలంటూ కమిషనర్ రాంబాబుకు సూచించారు. ప్రజల కోరిక మేరకు బండ్లపెంట ప్రాంతాన్ని హజరత్ సయ్యద్ యూసూబ్ షా వీధిగాను, ఠాణా ప్రాంతాన్ని ఎంబి చౌక్ గా పేర్లను మారు స్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది.

కౌన్సిలర్లు ఏదైనా కాంట్రాక్టు పనిచేస్తే తక్కువ మొత్తంలో బిల్లులు, ఆదే పనిని కాంట్రాక్టర్లు చేస్తే మరోరకంగా బిల్లులు చేస్తున్నారంటూ గౌస్ ఖాన్,హారూన్, నరసింహారెడ్డి, సాదక్ అలీ లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గడప గడపకు గుర్తించిన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గడప గడప పనులను త్వరగా పూర్తిచేయాలంటూ కోరారు. గడప గడపలో గుర్తించిన విద్యుత్ లైన్ ల మార్పు, కరెంటు స్తంభాల మార్పు. దెబ్బతిన్న స్తంబాల స్థానంలో కొత్తవి ఏర్పాటు పనులను తుఫాను డ్యామేజ్ కింద శరవేగంగా పూర్తిచేయాలంటూ ట్రాన్సుకో ఎఈని ఎమ్మెల్యే ఆదేశించారు.

పట్టణం పైభాగం నుండి వెళుతున్న 33 కెవి విద్యుత్ లైన్ మార్పుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలంటూ ఎఈ పీరాన్ కు సూచించారు.రేషన్ కార్డులో పేర్లమార్పుకు అవరోధంగా మారిన సాధికారసర్వేలో మార్పులు చేర్పులపై సిఎంతో చర్చించామంటూ చెప్పారు. కౌన్సి లర్ విజయమ్మ మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగం కార్మికులను కొందరిని ఆఫీసు పనులతో వినియోగించుకో వద్దంటూ ఎన్ని పర్యాయాలు చెప్పినా కమిషనర్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.ఠాణా వద్ద నుండి సుండుపల్లె మార్గంలోని తిరిగే ప్రాంతంలో గుంతలు. మిట్టలుగా ఉన్న ప్రాంతంలో రోడ్డువేయాలంటూ కౌన్సిలర్లు కోరారు.