
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ఏపిలో పలు భారీ పరిశ్రమల స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా స్టీల్, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల స్థాపనకు కేంద్ర పెట్టుబడుల ప్రోత్సహాక సంస్థ సోమవారం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కడపలో జె.ఎస్.డబ్ల్యు. సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో స్టీల్ ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వై.ఎస్.ఆర్ జిల్లా కడపకు సమీపంలోని సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8800 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా తొలివిడతగా రూ.3300 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు. తొలుత ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమ ద్వారా రాయలసీమ వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి.
రూ.6330 కోట్ల అదానీ గ్రూప్ పవర్ ప్లాంట్
ఏపిలోని అల్లూరి సీతరామరాజు జిల్లా పెదకోట వద్ద 1000మెగా వాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లా రైవాడ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్ లను అదానీ గ్రూప్ రూ.6330 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర పెట్టుబడుల ప్రోత్సహాక సంస్థ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏటా 4 మెగా వాట్ల ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా చేసుకొన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభించి 2024 డిసెంబర్ నాటికి లక్ష్యిత ఉత్పత్తి చేయనున్నారు.
రూ.8855 కోట్లతో సోమశిల వద్ద హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు
2100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8855 కోట్లతో హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర పెట్టుబడుల ప్రోత్సహాక సంస్థ అనుమతి ఇచ్చింది. ఇందులో ఎర్రవరం వద్ద 1200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లు త్వరలో ప్రారంభించనున్నారు. దశల వారిగా నిర్మాణం చేపట్టే ఈ ప్లాంట్ ల తోలి ఉత్పత్తి 2023 లో ప్రారంభమై, పూర్తి సామర్థ్యపు విద్యుత్ ఉత్పత్తి 2028 నాటికి పూర్తి చేయనున్నారు.