
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా తంభళ్లపల్లి మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఈయన తంభళ్లపల్లి నియోజకవర్గానికి 1989, 1999, 2004లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందులో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హవా కొనసాగిన సమయంలోనూ ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రభాకర్ రెడ్డి గత కొంత కాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఈయనను బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మద్యాహ్నం మరణించారు. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ రాజకీయ నాయకుడుగా ఎంతో పేరుపొందారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఈయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి సమీప బంధువు. కలిచర్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయాలలో ఎంతో నిజాయితీగా పనిచేశారు. పేదల కోసం ఎంతో శ్రమించారు. అందుకే నియోజకవర్గ ప్రజలు ఆయనను అప్ప అని, పెద్దాయన అని పిలుస్తారు. ప్రస్తుతం ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
బుధవారం అంత్యక్రియలు
మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వస్థలం పెద్దమండెం మండలం కలిచర్లలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారని కుటుంబసభ్యుల ద్వారా తెలిసింది.ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాజంపేట ఎం.పి. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంభళ్లపల్లి ఎం.ఎల్.ఏ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పలువురు ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలు హాజరు కానున్నారు.


