మదనపల్లి బి.టి.కాలేజీ ప్రభుత్వం స్వాధీనం..! – చక్రం తిప్పిన ఎం.పి.మిధున్ రెడ్డి

0
316

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ద విద్యాకేంద్రంగా బాసిల్లిన మదనపల్లి బి.టి.కాలేజీని త్వరలో ఏపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళశాలను ప్రస్తుతం చైన్నై లోని దివ్యజ్ఞాన ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఎయిడ్ తో నిర్వహించబడుతున్న ఈ కళాశాలను ట్రస్ట్ యజమాన్యం తమకు ప్రభుత్వ నిధులు అవసరం లేదని ప్రైవేటుగా నిర్వహించాలని ఇటివల భావించారు. దీంతో ఇక్కడ విధులు నిర్వహించే ఎయిడెడ్ ఉద్యోగులు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లడంతో యజమాన్యం స్వయంగా కాలేజీని నిర్వహిస్తోంది. ట్రస్ట్ తీరుపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేసి బి.టి.కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన రాజంపేట ఎం.పి. మిథున్ రెడ్డి, ఎం.ఎల్.ఏ నవాజ్ భాషలు ట్రస్ట్ సభ్యులతో చర్చించి బి.టి.కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలా ఒప్పించారు. ట్రస్ట్ బి.టి.కాలేజీని స్వాధీనం చేయడానికి మూడు షరతులను విధించింది.

అందులో 1.ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లినా కాలేజీ పేరును యాధావిధిగా కొనసాగించాలి. 2. కాలేజీ ఆస్తులు అన్యాక్రాంతం కారాదు. కాలేజీ ఆస్తులను ప్రభుత్వం సంరక్షించాలి. 3. కళశాలను విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి. బి.టి.కాలేజీని యూనవర్సిటిగా మార్చాలి అని ట్రస్ట్ ప్రభుత్వానికి తెలిపింది.ఈ షరతులకు ప్రభుత్వం సమ్మతించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బి.టి.కాలేజీని ప్రభుత్వం స్వాధీనం కాకుండ కొంత మంది వ్యక్తులు విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీనిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహించి కాలేజీ ఆస్తిని వాణిజ్య అవసరాలకు వినియోగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎట్టికేలకు ట్రస్ట్ ప్రభుత్వానికి కాలేజీని స్వాధీనం చేసేందుకు సిద్ధం కావడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం కాలేజీకి భవనాలతో పాటు, విలువైన 6 ఎకరాల భూమి ఉంది. బి.టి.కాలేజీ ప్రభుత్వ స్వాధీనంలోకి రాకుండ కొంత మంది వ్యక్తులు తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలను ఎం.పి. మిధున్ రెడ్డి దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీనిని గమనించిన ఎం.పి. ట్రస్ట్ వారు ఒప్పుకొనేలా చక్రం తిప్పడంతో కథ సుఖాంతం అయిందని వార్తలు వస్తున్నాయి.

Besant Theosophical College, mpl

బి.టి కాలేజీ ప్రస్థానం ఇదే…

మదనపల్లి బి.టికాలేజీని డా.అనీ బిసెంట్ 1915, జూలై 19న స్థాపించారు.మొదట ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. 1919లో ప్రముఖ బెంగాల్ కవి, జాతీయ ఉద్యమ నాయకుడు రవీంద్రనాథ్ టాగూరు ఈ కళాశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా ఈయన మదనపల్లి బి.టి.కాలేజీలోనే జాతీయగీతం జనగణమన ను బెంగాలీ భాష నుండి ఇంగ్లీషులోనికి అనువదించారు. 1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధగా ఈ కాలేజీ నిర్వహించబడింది. 1956నుంచి బి.టి.కాలేజీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నిర్వహించబడుతోంది. ఈకాలేజీలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరినవారు ఎంతో మంది ఉన్నారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి బి.టికాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఏపి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయబాస్కర్ రెడ్డి ఇక్కడే చదివారు.