మదనపల్లిలో టమోటా ధరలు మరింత పైపైకి – కిలో ధర రూ.125

0
333

మనఛానల్ న్యూస్ – మదనపల్లి

ఏపిలో అతి పెద్ద టమోటా మార్కెట్ కేంద్రం చిత్తూరు జిల్లా మదనపల్లిలో గత వారం రోజుల నుంచి టమోటా ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి మరింత పైకి చేరి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు, వరదలతో టమోటా పంట భారీగా దెబ్బతింది. దీంతో దిగుబడి అనుహ్యాంగా పడిపోవడంతో మార్కెట్ లో టమోటాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితులలో మార్కెట్ కు వస్తున్న టమోటాల ధర అధికంగా పలుకుతుంది. మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్ లో 28 కేజీల క్రేట్ టమోటా ధర రూ.3500లు పలికింది. దీంతో హోల్ సేల్ గానే కిలో టమోటా ధర రూ.125లు గా ఉంటే వినియోగదారుడికి చేరే సరికి ఎంత ధర పలుకుతోందో అర్థం కావడం లేదు. ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే వ్యాపారులు మార్కెట్ కు వచ్చే టమోటా లను క్షణాలలో కొనుగోలు చేసేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ లో నెలకొన్న టమోటాల కొరతను నివారించడానికి మార్కెట్ యార్డులోని పలువురు మండీ యజమానులను చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి రోజుకు రెండు, మూడు లారీల సరకు దిగుమతి చేస్తున్నప్పుటికి వ్యాపారులకు సరిపోవడం లేదు. మంగళవారం ఉదయం చత్తీస్ ఘడ్ నుంచి వచ్చిన మూడు లారీల టమోటాలు కేవలం రెండు గంటలలోనే అమ్మకాలు పూర్తి అయ్యాంటే మదనపల్లి మార్కెట్ లోనే టమోటాలకి ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతుంది. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగుతుందని వ్యాపారులు అంటున్నారు.