బాలివుడ్ నటుడు దిలిప్ కుమార్ కన్నుమూత

0
92

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ప్రముఖ బాలివుడు నటుడు దిలిప్ కుమార్(98) ఊపిరితిత్తుల వ్యాధితో బాథపడుతూ బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలో ఓ ఆసుపత్రిలో చే రి చికిత్స పొందుతూ మరణించారు. గతేడాది దిలీప్‌ కుమార్‌ సోదరులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కరోనాతో మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్‌ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌. బాంబే టాకీస్‌ యజమాని ఈయనకు దిలీప్‌ కుమార్‌ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్‌ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో బిగ్గెస్ట్‌ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఆజాద్‌’ ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ బాలివుడ్ సినిమాకు మకుటలేని మహారాజుగా నిలిచారు.
ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డుతో పాక్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 – 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. దిలీప్ కుమార్ సినిమా రంగంలో ఓ శకం.