ట్రంప్‌కు ఎదురుదెబ్బ….అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన ప్రతినిధుల సభ

0
631

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది.తదుపరి ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు.

ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ నాయకుడు జోయ్‌ బైడన్‌ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్‌ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.బైడన్‌ కుమారుడు హంటర్‌ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి.ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్‌ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని బైడన్‌,ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచా రణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తూ అభిశంస నకు పట్టుబట్టారు.

అయితే ట్రంప్‌ మాత్రం వీటిని కొట్టిపడేశారు.ఈ క్రమంలో ఆడం చిఫ్‌ నేతృత్వంలో అభిశంసన విచారణ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది.ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి బుధవారం ఆమోదించింది.దీంతో ట్రంప్‌ అభిశంసనకు గురైనట్లు స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు.ఇక సెనేట్‌లో జనవరి నుంచి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు.అయితే సెనేట్‌లో అధికార రిపబ్లికన‍్ల ఆధిపత్యం ఉన్నందు వల్ల ట్రంప్‌ అభిశంసన వీగిపోయే అవకాశం ఉంది.