ఉల్లిని రూ.25కే అందించనున్న ఏపీ ప్రభుత్వం…రైతు బజార్లలో సరఫరా

0
35

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి బాగా డిమాండ్‌ అయిపోయింది.దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది.ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు,మార్కెటింగ్‌ శాఖలు,రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటి కప్పుడు సమీక్షిస్తోంది.

వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ,అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్,పౌరసరఫరాల శాఖ,విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు.ప్రతీ కిలో మీద రూ.50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది.