విజయవంతమైన ఆరోగ్య తిరుపతి ఉచితవైద్య, రక్తదాన శిబిరం

0
98

మనఛానల్ న్యూస్ – తిరుపతి
మానవ జీవన విధానంలో ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురౌతున్నాయని, దీనివల్ల వెనుకబడిన వర్గాలకు వైద్యసేవలు గగనమౌతున్నాయని భావించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే తిరుపతిలో ఆరోగ్య తిరుపతి పేరిట ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తిరుపతికి చెందిన ప్రముఖ ఉన్నత పోటిపరీక్షల శిక్షణ సంస్థ శ్రీ ప్రజ్ఞ ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ తేజ తెలిపారు. ఆరోగ్య తిరుపతి పేరిట ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ , నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తిరుపతివారు సహకారం అందించారు. రెండు రోజుల కార్యక్రమానికి ప్రజలు విశేషంగా హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రజలు పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిపుణులైన వైద్యుల చేత చేయించుకొన్నారు.మధుమేహ వ్యాధి నిర్ధారణ కోసం థైరో కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్క్ర్రీ నింగ్ పరీక్షలు నిర్వహించారు. గురువారం కేర్ ప్లస్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు,ఎన్.టి.ఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన కార్యక్రమం, నారాయణాద్రి హస్పిటల్స్ డాక్టర్ రమేష్ ద్వారా డెంగ్యూ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కేంద్రం జిల్లా సెలక్షన్ కమిటి సభ్యులు మార్గాని సోమశేఖర్ మాట్లాడుతూ..ఆహారపు అలవాట్లు ,వ్యాయామం, యోగ, ద్యానం వంటివి ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతర ప్రక్రియగా మారాలని, దీనిద్వారా మానవుని జీవితం ఆనారోగ్యాలకు దూరంగా ఉంటుందన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం సమాజం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఆరోగ్య తిరుపతి కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన వారందరికి శ్రీ ప్రజ్ఞ ఐ.ఎ.ఎస్ అకాడమి డైరక్టర్ తేజ కృతజ్ఞతలు తెలిపారు.