చిత్తూరుజిల్లా మొగలి ఘాట్‌ రోడ్డులో ఘోరరోడ్డు ప్రమాదం – 12 మంది మృతి

0
67

మనఛానల్‌ న్యూస్‌ – బంగారుపాళ్యం
తమ బంధువు ఒకరు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మరో కుటుం బాన్ని మృత్యువు వెంటాడింది.రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందితోపాటు మరో నలుగురు మృత్యువాతపడిన విషాదకర సంఘటన చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్‌రోడ్డులో చోటు చేసుకుంది.ఘాట్‌ రోడ్డులో డీజిల్‌ ఆదా చేసేందుకు కంటైనర్‌ డ్రైవర్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతుల్లో 9 మంది చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.బెంగళూరు నుంచి వాటర్‌బాటిళ్ల లోడ్‌తో విజయ వాడకు వెళ్తున్న కంటైనర్‌ బంగారుపాళ్యం సమీపంలోని మొగిలి ఘాట్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఓమ్ని వాహనం,ద్విచక్రవాహనంపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓమ్ని వాహనంలో ప్రయాణి స్తున్న 9 మంది,ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

కంటైనర్‌ డ్రైవర్‌ ఆచూకీ తెలియలేదు.అతను సంఘటన జరిగిన వెంటనే పరారై ఉంటాడని కొందరు చెబుతుండగామరికొందరు మాత్రం అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి వరకు10 మంది మృతులను గుర్తించగా వారిలో డ్రైవర్‌ అక్షయ్‌ లేడు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తక్షణం సాయంగా రూ.50 వేలు,వైఎస్సార్‌ భరోసా కింద రూ.7 లక్షలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు.

అసలేం జరిగిందంటే చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వెంకటమ్మ చెల్లెలి భర్త శ్రీనివాసులు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడిది తవణంపల్లె మండలం తెల్ల గుండ్లపల్లె కావడంతో శ్రీనివాసులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెంకటమ్మతో పాటు బంధువులు, మర్రిమాకులపల్లె గ్రామస్తులు తెల్లగుండ్లపల్లెకు వెళ్లారు. అంత్యక్రియలు శనివారం కావడంతో తిరిగి వాహనంలో మర్రిమాకులపల్లెకు పయనమయ్యారు.అదే సమయంలో వాటర్‌ బాటిళ్లతో విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్‌ బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద అతి వేగం వల్ల అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

మర్రిమాకులపల్లెకు చెందిన గ్రామస్తులు ప్రయాణిస్తున్న ఓమ్ని వాహనంతో పాటు వెనుకనే వస్తున్న ద్విచక్రవాహనంపై కంటైనర్‌ బోల్తాపడింది. దీంతో ఓమ్నిలో ప్రయాణిస్తున్న రామచంద్ర (39), రాము (38), సావిత్రమ్మ (50), ప్రమీల(37), సుబ్రహ్మణ్యం(40), శేఖర్‌ (45), వెంకటమ్మ(70), పాపన్న (43) రాణెమ్మ (45)తో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన నరేంద్ర (40) అక్కడిక్కడే మరణించారు.కంటైనర్‌ క్లీనర్‌ రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటో త్రుటిలో పక్కకు తప్పుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.