అట్లాంటాలో అంబరాన్న౦టిన బతుకమ్మ సంబరాలు

0
55

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
బతుకమ్మ సంబరాలను తెలంగాణలో కాకుండా దేశవిదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా బతుకమ్మ పండుగను అమెరికాలోని అట్లాంటా నగర౦లో ఘనంగా జరుపు కున్నారు.ఆటపాటలతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది.తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ (టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 5న సౌత్‌ ఫోర్సిత్‌ మిడిల్‌ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి.అట్లాంటాలో వందల సంఖ్యలో నివసిస్తోన్న తెలంగాణ మహిళలు వేడుకకు తరలి వచ్చారు.

వారంతా కలిసి గౌరీదేవీని తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరయ్యారు.అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. ఈ వేడుకలో పసి పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలకు 2,500మంది పైచిలుకు హాజరయ్యారు.ఇక దసరా పండగను జమ్మి పూజతో ప్రారంభించారు. కోలాటాల కోలాహలంతో వేడుక కన్నులవిందుగా సాగింది.అందంగా తయారు చేసిన బతుకమ్మలకు టీడీఎఫ్‌ జ్యూరీ బహుమతులను అందజేసింది.

టీడీఎఫ్‌ బృందం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాక, తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్‌ పాత్రను గుర్తు చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నానమ్మ-మనుమరాలు థీమ్‌తో ఈ యేడాది తీసుకువచ్చిన ఆన్‌సైట్‌ బతుకమ్మకు విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియ జేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించామని పేర్కొంది.టీడీఎఫ్‌ సంస్థ తెలంగాణలో చేపడు తోన్న అభివృద్ధి,సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది.