అక్టోబర్‌ 15 నుండి ఏపీలో పప్పు ధాన్యాల సేకరణ

0
52

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది.దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ చర్యలు తీసుకుంది.

వైఎస్‌ జగన్‌ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు.రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందు కు ఈ–క్రాపింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.శనగల కొను గోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది.గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు.వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.