తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

0
275

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
సమస్యల పరిష్కారానికై తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు.రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల మినహా ఈ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది.డిపోల్లో బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్ డిపోలతోపాటు బస్ స్టేషన్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.పలు చోట్ల ఆర్టీసీ కార్మి కులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో కొన్ని మార్గాలలో పోలీసుల భద్రత నడుమ అద్దె బస్సులతో పాటు ప్రయివేట్‌ వాహనాలు నడుస్తున్నాయి.ప్రయివేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వ తీవ్ర హెచ్చరిక నేప థ్యంలో కార్మికులు మాత్రం పునరాలోచనలోపడ్డారు.కార్మిక సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ హెచ్చరి కలతో భయపడేది లేదని సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అయితే ఈ రోజు సాయంత్రం వరకు కాస్త గందరగొళ పరిస్థితి ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని,ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది.ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తారో చూస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.తమ డిమాండ్లను ఆమోదించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేవారు.