మేరీకోమ్‌కు పద్మవిభూషణ్‌,పి.వి.సింధుకు పద్మభూషణ్‌ – ప్రతిపాదించిన క్రీడలశాఖ

0
176

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తూ భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు తగిన గుర్తింపునివ్వబోతోంది కేంద్రం. ప్రతిష్ఠాత్మక రియో(2016) ఒలింపిక్స్‌లో రజతంతో పాటు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన భారత బ్మాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు చేరబోతున్నది.

దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ బ్యాడ్మింటన్‌లో అనితరసాధ్యమైన విజయాలు అందుకుంటున్న సింధును దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర క్రీడాశాఖ గురువారం సిఫారసు చేసింది. 2017లో అవార్డుకు సింధు పేరును ప్రతిపాదించినా తుది జాబితాలో పేరు లేకపోవడంతో పురస్కారం దక్కలేదు.తొలిసారి 2015లో ఈ తెలుగు షట్లర్ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకుంది.మరోవైపు ప్రపంచ బాక్సింగ్‌లో తనదైన ముద్రవేసిన మేరికోమ్‌ను రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు.

ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఒక క్రీడాకారిణి పేరును సిఫారసు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2006లో పద్మశ్రీ,2013లో పద్మభూషణ్ అవార్డు అందుకున్న మేరి ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.వీరితో పాటు పద్మశ్రీ అవార్డు కోసం వినేశ్ ఫోగట్(రెజ్లింగ్),మనికా బాత్రా(టీటీ), హర్మన్‌ప్రీత్‌కౌర్(క్రికెట్),రాణి రాంపాల్(హాకీ),సుమ షిరూర్(షూటింగ్),కవల పర్వతారో హకులు తషీ,నుంగ్షీ మాలిక్,తరుణ్‌దీప్ రాయ్(ఆర్చరీ),ఎంపీ గణేశ్(హాకీ) పేర్లను క్రీడాశాఖ ప్రతిపా దించింది.మొత్తంగా 11 మందిలో ఏడుగురు మహిళలు అవార్డుల బరిలో ఉండటం ఇదే తొలిసారి.