భాగ్యనగరంలో కనులపండుగగా గణేశుడి నిమజ్జనోత్సవాలు

0
79

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
భాగ్యనగరంలో గణేశుడి నిమజ్జనోత్సవాలు కనుల పండుగగా సాగుతోంది.వేలాది గణేశుడి విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నాయి.ఇందులో ముఖ్యంగా ఖైరతాబాద్‌,బాలాపూర్‌ విగ్రహాలు అతిపెద్దవిగా గుర్తింపు పొందాయి.హైదరాబాద్‌ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 45 వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు.

ఇవాళ ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు.ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ,కర్ణాటక,మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

35 వేలమంది పోలీసులతో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.శోభాయాత్ర జరిగే మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.మరోవైపు దాదాపు 10 వేలమంది కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో నిమగ్న మయ్యారు.

నగరంలోని వీధులన్నీ శోభయాత్ర వెలుగులను సంతరించుకున్నాయి.శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం జరగనుంది.కాగా,నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జ నోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి.