నేత్రా పర్వంగా గంధ మహోత్సవం – రొట్టెల పండుగకు హాజరైన ఏపీ మంత్రులు

0
77

మనఛానల్‌ న్యూస్‌ – శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ వేడుకలు నేత్రాపర్వంగా జరుగుతున్నాయి.రొట్టెల పండుగలో ముఖ్య ఘట్టమైన గంధమహోత్సవంలో సుగంధపరిమళాలు వెదజల్లాయి.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది.కులాలకు అతీతంగా, మత సామరస్యంగా జరుగుతున్న రొట్టెల పండగకు మూడో రోజు గురువారం భారీగా భక్తులు పోటెత్తారు.

స్వర్ణాల చెరువు తీరాన పవిత్ర స్నానమాచరించి తీరిన కోర్కెలతో భక్తులు రొట్టెలు వదలగా కోర్కెలతో వచ్చిన భక్తులు రొట్టెలు పట్టుకున్నారు.అనంతరం బారాషహీద్‌లను భక్తితో దర్శించుకున్నారు. దేశ,విదేశాల నుంచి వస్తున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు.

బారాషహీద్‌ దర్గాను దర్శించుకున్న రాష్ట్రమంత్రులు : బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండగ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి,ఇరిగేషన్‌ శాఖమంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా కోరికల రొట్టెలను పట్టుకున్నారు.అనంతరం షహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించారు.వివిధ శాఖల అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు.