కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం – ఏపీ సీఎం జగన్‌ స్పష్టం

0
329

మనఛానల్‌ న్యూస్‌ – శ్రీకాకుళం
కిడ్నీ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మాణం, రెండువందల పడకల ఆసుపత్రి నిర్మాణం, మత్స్యకారులకు ఒక జెట్టీని,ఉద్దానం కిడ్నీ బాధితులకు రక్షిత త్రాగునీటి అందించే పథకాలకు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాను సుదీర్ఘంగా 3648 కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర చేసి నప్పుడు, మీ బాధలు విన్నాను, నేను ఉన్నాను అని భరోసా కల్పించామన్నారు.మీ అందరి చల్లని ఆశీస్సులతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు.అందులో భాగంగానే అధికారంలోకి రాగానే మొదటి సంతకం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ చేసుకునేందుకు వీలుగా వారి పెన్షన్‌ రూ.10 వేలకు పెంచిన ఘనత తమదేనన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక సంస్కరణలను చేపట్టామన్నారు.

రాష్ట్రంలో పారదర్శకమైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.పోలవరం పనులకు రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామన్నారు.అంతేకాకుండా అక్టోబర్‌ 15 నుండి రాష్ట్రంలోని రైతుకు రూ.12,500లను అందజేసే కార్యక్రమం మొదలవుతుంది.వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు అందజేస్తామన్నారు.బోట్‌లు కలిగిన మత్స్యకారులకు డీజిల్‌పై రాయితీని 9 రూపాయలకు అందజేస్తామన్నారు.ఇక డిసెంబర్‌ నెలలో సొంతమగ్గాలు కలిగి ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయలను అందజేయడం, వచ్చే ఏడాది జనవరి 26 నుండి పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి రూ.15 వేలను అందజేయడం,రాష్ట్రంలోని రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,దర్జీలకు రూ.10 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

వచ్చే ఉగాది నాటికి ప్రతి ఇళ్లు లేని ప్రతి మహిళ పేరిట 25 లక్షల ఇళ్ల పట్టాలను ఇస్తామని, దాంతో పాటు ప్రతి ఏడాది రూ.6 లక్షలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.రాబోవు రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టేందుకు,ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు.ఇక ఫైలట్‌ ప్రాజెక్టు అయిన తెల్ల రేషన్‌ కార్డులను కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ఈ జిల్లా నుండే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుండి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం,మంత్రులు కొడాలి నాని,ధర్మాన కృష్ణదాస్‌,ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు,ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.