అరుణ్‌ జైట్లీ మృతి పట్ల నివాళులర్పించిన ప్రముఖులు

0
50

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.బహుముఖ ప్రజ్ఞాశాలి,కేంద్ర మాజీమంత్రి,బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ (66) ఇకలేరు.ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1952 డిసెంబర్‌ 28న అరుణ్‌జైట్లీ జన్మించారు.ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అరుణ్‌ జైట్లీ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ,ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,హోంమంత్రి అమిత్‌ షా,రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,నితిన్‌ గడ్కరీ,ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అరుణ్‌ జైట్లీ రాజకీయ దిగ్గజం.అత్యున్నత మేధో సంపత్తి గల వ్యక్తి.

దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత.సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయ కంగా నిలిచారు.భారత రాజ్యాంగం,చరిత్ర, ప్రజా విధానాలు, పాలనా వ్యవహారాలపై సునిశిత విజ్ఞానం ఆయన సొంతం.సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు.అలా దేశ ఆర్థిక వృద్ధి, రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించారు.

భాజపాకు, జైట్లీకి విడదీయరాని అనుబంధం ఉంది.విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే దేశం కోసం పాటుపడ్డారు.ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎంతో శ్రమించారు.ఆయన మృతి విచారకరం.ఓ మంచి స్నేహితుడిని కోల్పోయామని మోదీ సంతాపం తెలిపారు.