కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం – పరిస్థితులు యధాతథం

0
55

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించనున్నామన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.

శ్రీనగర్‌ లాంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదన్నారు. కొంతమందికి స్వల్ప గాయాలవ్వగా వారికి వెంటనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశామన్నారు.సామాన్య ప్రజలకు ఎటువంటి హాని కలగొద్దన్న లక్ష్యంతోనే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు.అనేక మంది ఇక్కడి శాంతిభద్రతలపై వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ క్రమంలో 2016, 2010 నాటి ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు, చిత్రాలను వ్యాప్తి చేస్తున్నారు.

అటువంటి అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.నకిలీ వార్తల్ని నియంత్రించడానికి ప్రభుత్వం సైతం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.కశ్మీర్‌పై కీలక నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. ఇంటర్నెట్‌,మొబైల్‌ సేవల్ని నిలిపివేశారు.ప్రముఖ రాజకీయ, వేర్పాటు వాద నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఎక్కడా భారీ ప్రదర్శనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు.