స్పందన కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ వీడీయో కాన్ఫ్‌రెన్స్‌

0
53

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ప్రతివారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సమస్యలు సాధ్య మైనంత వరకు పరిష్కారమవుతున్నాయని సీఎం వై.ఎస్‌.జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.స్పందన కార్యక్రమానికి ఆదరణ పెరగడంపై ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ వివరంగా మాట్లాడారు.క్రమం తప్పకుండా కాల్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజల నుంచి వచ్చే వినతులపై కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మార్వోలు,ఎస్‌ఐలు బాగా స్పందిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకుంటామని, సర్వేలు కూడా చేయిస్తామన్నారు.అలాగే వినతులు పరిష్కారంపై అసంతృప్తిగా ఉన్నవారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు.స్పందనకు వస్తున్న వినతుల్లో 90 శాతం పరిష్కారం అవుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

అసంతృప్తి స్థాయి సగటు 9.5 శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్తులో ఇది 1 శాతం కన్నా తక్కువగా ఉండాలని సూచించారు.కలెక్టర్‌ నుంచి దిగువస్థాయి అధికారి వరకు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పనిచేయాలని ఆదేశించారు.అలాగే తిరస్కరించిన వినతుల సగటు 7.6 శాతం ఉందని వీటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు.