ఆర్టికల్‌ 370 రద్దు దేశప్రజల అభీష్టానికి విరుద్ధం – మాజీ ప్రధాని మన్మోహన్‌

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
అధికరణ 370 రద్దు దేశ ప్రజల అభీస్టానికి విరుద్ధమని భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రా యపడ్డారు.ఈ అధికరణ జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై మన్మో హన్‌ మాట్లాడుతూ భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని ఈ తరుణంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు.

దిల్లీలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా సైతం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బట్టారు.ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని మన్మోహన్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన్ని విజ్ఞానగనిగా అభివర్ణించారు.

పదేళ్లు తన మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా ఆయన పని చేశారని, క్లిష్ట సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.ఆయన మృతితో భారత రాజకీయ రంగం ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. నాలుగు ప్రభుత్వాల్లో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించినా ఎటువంటి మచ్చ లేకుండా గడిపారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏచూరి,రాజా సైతం జైపాల్‌ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.