ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్‌ – హోరాహోరీ ఫైనల్ పోరులో కివీస్‌ చిత్తు

0
50

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌ గెలవాలన్న ఇంగ్లాండ్‌ 44 ఏళ్ల సుదీర్ఘ కల ఎట్టకేలకు నెరవేరింది.లండన్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టై అయిన అనంతరం సూపర్‌ ఓవర్లో విజయాన్ని సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.దీంతో పుట్టినింటికి ప్రపంచకప్‌ చేరింది. తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం. అనంతరం సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమం అయ్యాయి. అయితే సూపర్‌ ఓవర్‌లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.దీంతో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ మ్యాచ్‌ ఇంత థ్రిల్లింగ్‌గా సాగింది. తొలుత కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా ఇరు జట్లు సమంగానే స్కోర్లు నమోదు చేశాయి. ఇంగ్లండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సిరీస్‌ ఆసాంతం జట్టుకు అద్భుత విజయాలను అందించిన కేన్‌ విలియమ్సన్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ తడబడింది.

ఎంతటి భారీ స్కోర్లనైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 242 పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడింద. కివీస్‌ అద్భుత బౌలింగ్‌తో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో, 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు చివరి వరకు ఉండి కివీస్‌ను ప్రతిఘటించాడు.స్టోక్స్‌కు తోడుగా బట్లర్‌(59; 60 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు.

కివీస్‌ బౌలర్లలో నీషమ్‌, ఫెర్గుసన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్‌ ఆటగాళ్లలో నికోలస్‌(55), లాథమ్‌(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు.విలియమ్సన్‌(30) ఫర్వాలేదనిపించాడు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి కివీస్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు.