రెండో సెమీఫైనల్లో ఆసీస్‌ చిత్తు – ఫైనల్లో ప్రవేశించిన ఇంగ్లాండ్‌

0
62

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌-2019 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు దర్జాగా ప్రవేశించింది. రెండో సెమీఫైనల్లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. దీంతో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది.ఇక ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగింది.

ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.రాయ్‌కు తోడు రూట్‌(40 నాటౌట్‌) మోర్గాన్‌(40 నాటౌట్‌), బెయిర్‌ స్టో(34)లు రాణించడంతో ఇంగ్లండ్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ను పతనాన్ని శాసించిన క్రిస్‌ వోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ ఏమాత్రం తడబాటుకు గురికాలేదు.

ఓపెనర్లు రాయ్‌, బెయిర్‌ స్టోలు చక్కటి శుభారంభాన్ని అందించారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం బెయిర్‌ స్టోను స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.ఓ వైపు అర్ద సెంచరీ సాధించి శతకం వైపు దూసుకెళ్తున్న జేసన్‌ రాయ్‌ అంపైర్‌ తప్పిదానికి బలయ్యాడు.దీంతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం వచ్చిన రూట్‌, మోర్గాన్‌లు మరో వికెట్‌ పడకుండా విజయాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్‌ వోక్స్‌(3/20), అదిల్‌ రషీద్‌(3/54), ఆర్చర్‌(2/32)లు చెలరేగడంతో ఆసీస్‌ విలవిల్లాడింది. అయితే స్టీవ్‌ స్మిత్‌(85; 119 బంతుల్లో 6ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. స్మిత్‌తో పాటు అలెక్స్‌ కారీ(46) గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్‌ చేశాడు.చివర్లో మ్యాక్స్‌వెల్‌(23), స్టార్క్‌(29)లు ఓ మోస్తారుగా రాణించడంతో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ముందుంచగలిగింది.