ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఖేల్‌ఖతం – కీలక మ్యాచ్‌లో పాక్‌చేతిలో చిత్తు

0
48
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
నిరాశజనకమైన ఆటతీరుతో ప్రపంచకప్‌ నుండి దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. దీంతో ఈసారైనా కప్పు గెలవాలన్న ఆ జట్టు ఆశలు ఆవిరైపోయాయి.లండన్‌ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు చేతిలో 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించారు.తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరు గులు చేసి ఓడింది.డుప్లెసిస్‌ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్‌ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

పాక్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (58 బంతుల్లో 44; 6 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (50 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు.కుదురుగా ఆడుతున్న ఓపెనర్లను ఇమ్రాన్‌ తాహిర్‌ ఔట్‌ చేశాడు. తర్వాత బాబర్‌ ఆజమ్, హఫీజ్‌ (20)లు కూడా బాధ్యతగా ఆడటంతో సఫారీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు.హఫీజ్‌ వెనుదిరిగాక వచ్చిన హరిస్‌ సొహైల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆజమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు.

బాబర్‌ 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 224 పరుగుల వద్ద బాబర్‌ నిష్క్ర మించగా, సొహైల్‌ ఇమాద్‌ వసీమ్‌ (23; 3 ఫోర్లు) కలిసి ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన సొహైల్‌ 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆరంభంలోనే ఆమ్లా (2) ఔట్‌ కాగా డికాక్, కెప్టెన్‌ డుప్లెసిస్‌ క్రీజులో ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా గెలుపు మీద ఆశలు పెట్టుకుంది.

వీళ్లిద్దరు పాక్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్‌కు 87 పరు గులు జోడించారు. డికాక్‌తో పాటు స్వల్ప వ్యవధిలో మార్క్‌రమ్‌ (7)ను స్పిన్నర్‌ షాదాబ్‌ ఔట్‌ చేశాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న డుప్లెసిస్‌ను ఆమిర్‌ పెవిలియన్‌ చేర్చాడు. 136 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యానికి దూరమైంది.