గర్జించిన బంగ్లా పులులు – తోక ముడిచిన విండీస్‌ వీరులు

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ మరోసారి గర్జించింది.ఇప్పటికే పటిష్టమైన సౌతాఫ్రికాను ఓడించి తమ సత్తా చాటిన బంగ్లాదేశ్‌ తాజాగా భీకర ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్‌ జట్టును మట్టికరిపించి మిగిలిన జట్లకు హెచ్చరికలు పంపింది.లండన్‌ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.

ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో షై హోప్ (121 బంతుల్లో 96 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), లూయీస్ (67 బంతుల్లో 70 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 50 పరుగులు,4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు.బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, రహమాన్‌లు చెరో 3 వికెట్లు తీయగా, షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 322 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆది నుంచి విండీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో బంగ్లా జట్టులో షకిబ్ అల్ హసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 99 బంతుల్లోనే 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అలాగే మరో బ్యాట్స్‌మెన్ లైటన్ దాస్ కూడా విండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు.

69 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో దాస్ 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకు ముందు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (53 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు), సౌమ్యా సర్కార్ (23 బంతుల్లో 29 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు బంగ్లాదేశ్‌కు చక్కని ఆరంభాన్ని ఇవ్వగా ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఏ దశలోనూ మ్యాచ్ చేజారిపోకుండా ఆద్యంతం విండీస్ బౌలర్లపై బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రద ర్శించారు.ఎప్పటికప్పుడు బౌండరీలను బాదుతూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.దీంతో విండీస్ కోలుకోలేకపోయింది.ఈ క్రమంలో బంగ్లాదేశ్ కేవలం 41.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి విండీస్‌పై గెలుపొందింది.