కౌల్టర్‌నైల్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ – వెస్టిండీస్‌పై ఆసీస్‌ గెలుపు

0
33
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలిపోతుందనుకున్న ఆసీస్‌ను కౌల్టర్‌నైల్‌ (92 పరుగు లు 8×4, 4×6) నిలబెట్టాడు.దీంతో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను 15 పరుగుల తేడాతో ఓడిరచి ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించి చిత్తుచిత్తుగా ఓడించిన వెస్టిండీస్‌ ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.

గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది.ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్ తో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను స్టార్క్‌(5/46) గడగడలాడించాడు. స్టార్క్‌తో పాటు కమిన్స్‌(2/41) రాణించ డంతో విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులకే పరిమితమైంది.

విండీస్‌ ఆటగాళ్లలో హోప్‌(68), హోల్డర్‌(51), నిఖోలస్‌(40) మినహా ఎవరూ గొప్పగా రాణించలేదు.ఈ మ్యాచ్‌లో రాణిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను క్రిస్‌ గేల్‌(18), రసెల్‌(15)లు పూర్తిగా నిరాశపెట్టారు. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌కు విండీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు.

కరేబియన్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ సారథి ఫించ్‌(6)తో సహా వార్నర్‌(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్‌(0), స్టొయినిస్‌(19)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే కౌల్టర్‌ నైల్‌(92), స్టీవ్‌ స్మిత్‌(74)లు రాణించ డంతో కనీస స్కోర్‌నైనా సాధించగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్టర్‌ నైల్‌ విండీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోర్‌ బోర్డు పరిగెత్తింది.

తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన విండీస్‌ బౌలర్లు చివర్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఒకానొక సమయంలో ఆసీస్‌ 300 స్కోర్‌ దాటుతుందనుకున్న తరుణంలో చివర్లో వికెట్లు పడటంతో సాధించలేక పోయింది.దీంతో ఆసీస్‌ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది.