ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం – దక్షిణాఫ్రికాపై ఘనవిజయం

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అజేయశతానికితోడు మణికట్టు మాంత్రికుడు చహల్‌ నాలుగు వికెట్లతో చెలరేగిన వేళ ప్రపంచకప్‌లో భారతజట్టు తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ఆటతో తమ తొలి మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది.

‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (144 బంతుల్లో 122 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో రాణించిన వేళ దక్షిణాఫ్రికాతో బుధవారం సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌ మైదానంలో జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో జయభేరి మోగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (4/51) మాయాజాలం, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/35) పకడ్బందీ బౌలింగ్‌తో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

8వ నంబరు బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ మోరిస్‌ (34 బంతుల్లో 42; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. రబడ (35 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు)తో అతడు జోడించిన 66 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వా మ్యం. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (54 బంతుల్లో 38; 4 ఫోర్లు), ఫెలుక్వాయో (61 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్‌) మోస్తరుగా ఆడారు. భువనేశ్వర్‌ (2/44) ఆఖర్లో రెండు వికెట్లు తీశాడు.

ఛేదనలో రోహిత్‌ శతకానికి రాహుల్‌ (42 బంతుల్లో 26; 2 ఫోర్లు), ధోని (46 బంతుల్లో 34; 2 ఫోర్లు) అండగా నిలవడంతో భారత్‌ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 230 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ను లండన్‌లో ఈ నెల 9న ఆస్ట్రేలియాతో ఆడనుంది.