టివి9 రవిప్రకాష్ నిర్ణయమేమి..? అరెస్ట్ …లొంగుబాటా ?

0
38
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
టివి9 రవిప్రకాష్ కు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇచ్చిన నోటీసులకు స్పందించడం లేదు..ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఆయనకు చుక్కెదురైంది…ఇక ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతారా..లేక బలవంతంగా పోలీసుల చేత అరెస్ట్ అవుతారా ? అనేది బుధవారం సాయంకాలానికి తేలిపోతుంది.ఇప్పుడు ఈ ఆంశం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ టెలివిజన్ సంస్థ టివి 9లో అక్రమాలకు పాల్పడడం, కొత్త యాజమాన్యానికి మోసం చేయడం, విలువైన డేటా చౌర్యం వంటి కేసులలో పీకలలోతు ఇరుక్కొన్న టివి9 మాజీ సి.ఇ.ఓ రవిప్రకాష్, అతని మిత్రుడు, నటుడు, ఆపరేషన్ గరుడతో పాపులర్ అయిన శివాజీలు పరారీలో ఉన్నట్లు తెలంగాణా పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో విచారణకు హాజరు అయి వాస్తవాలు వెల్లడించాలని తెలంగాణ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా వారిరువురు స్పందించలేదు. రెండు, మూడు సార్లు గడువు ఇచ్చినా వారు స్పందించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.

ఇంకోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేదా అనేది మీడియా వర్గాలకు ఉత్కంఠతగా మారింది. అయితే రవిప్రకాష్, శివాజీలకు అంతర్గతంగా మద్దతు ఇస్తున్న కొందరు గాడ్ పాధర్ లు మాత్రం వారిని అరెస్ట్ నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దీంతో వారు బుధవారం స్వచ్ఛందంగా పోలీసులు లేదా కోర్టు ఎదుట గాని లొంగిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.

మే23వతేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల అయిన అనంతరం వారు లోంగి పోయే విషయాన్ని ఆలోచించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతవరకు పోలీసులకు అందుబాటులోకి రాకుండ ఉండాలని చూస్తున్నారని వినికిడి.నటుడు శివాజీ విదేశాలకు పారిపోయినట్లు పోలీసుల అంచనా. అయితే, రవిప్రకాష్ ప్రస్తుతం ఏపిలో ఉన్నారని పోలీసుల అనుమానం. ఏపిలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన పార్టీకి చెందిన కొంత మంది నేతలు రవిప్రకాష్ కు ఆశ్రయం ఇచ్చినట్లు పుకార్లు వస్తున్నాయి.

రవిప్రకాష్ విజయమాల్యా మాదరిగా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. మరో వైపు రవిప్రకాష్ టివి9 కొత్త యాజమాన్యంతో రాజీకీ మధ్యవర్తుల ద్వారా ప్రయత్నిస్తున్నారనే వార్తలు బుధవారం నాడు వినిపించాయి. టివి9 రవిప్రకాష్ కు కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనందున, ఆయన తప్పనిసరిగా అరెస్ట్ కావడమో లేక లొంగిపోవడమో చేయాలి. లేని పక్షంలో ఆయన అజ్ఞాతంలోనే ఉండాలి. బుధవారం సాయంకాలం లోపు ఆయన ఏదోక నిర్ణయం తీసుకోవాలి. రవిప్రకాష్ ఏ నిర్ణయం తీసుకొంటారనేది కూడ ఉత్కంఠతగా మారింది.