తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా చౌహాన్‌ వ్యవహరిస్తున్నారు.

హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజి యం నిర్ణయించింది. ఆయనను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. జస్టిస్‌ చౌహాన్‌ నేపథ్యం జస్టి స్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఇటీవల కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.