చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్‌ – ఐపీఎల్‌ టైటిల్‌ నాలుగోసారి కైవసం

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ముంబయి ఇండియన్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్‌ టైటిల్‌ను నాలుగుసార్లు సొంతం చేసుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం వేదికగా జరిగిన ఐపీఎల్‌- 12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

మొదట బ్యాటింగ్‌ పిచ్‌పై భారీస్కోరు సాధించి.. చెన్నైపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా రోహిత్‌ టాస్‌ గెలవ గానే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్‌ ఆరంభంలోనే శార్దూల్‌ బౌలింగ్‌లోభారీ సిక్సర్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్లో డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6) చెలరేగాడు. 3 భారీ సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్‌ విడదీ శాడు. భారీషాట్‌కు ప్రయత్నించిన డికాక్‌ ధోని చేతికి చిక్కాడు.

అక్కడ్నుంచి చివరి వరకు ముంబయి బ్యాటింగ్‌ తడబాటు కొనసాగింది. ఆ తర్వాతి ఓవర్లోనే అద్భుత మైన బంతితో రోహిత్‌ (15; 14 బంతుల్లో 1×4, 1×6)ను చాహర్‌ బోల్తాకొట్టించాడు. ఈ ఓవర్లో వికెట్‌, మెయిడిన్‌తో చాహర్‌ ఆకట్టుకున్నాడు. పవర్‌ ప్లేలో ముంబయి 2 వికెట్లకు 45 పరుగులే చేసింది. అనంతరం ముంబయి బ్యాట్స్‌మెన్‌పై చెన్నై బౌలర్లు ఒత్తిడి పెంచారు. హర్భజన్‌, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో సూర్యకుమార్‌ (15; 17 బంతుల్లో 1×4), ఇషాన్‌ కిషన్‌ (23; 26 బంతుల్లో 3×4) జాగ్రత్తగా ఆడారు.

ఐతే క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్‌.. తాహిర్‌ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. శార్దూల్‌ వేసిన తర్వాతి ఓవర్లో కృనాల్‌ పాండ్య (7) అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ బాదిన సిక్సర్‌తో ముంబయి స్కోరు 100 (14.1 ఓవర్లలో)కు చేరుకుంది. ఐతే అదే ఓవర్లో ఇషాన్‌ ఔటయ్యాడు. పొలార్డ్‌కు జతగా హార్దిక్‌ క్రీజులో ఉండటంతో ముంబయి భారీస్కోరుపై ఆశలు సన్నగిల్లలేదు.

advertisment

అందుకు తగ్గట్లే పొలార్డ్‌, హార్దిక్‌ సిక్సర్లతో చెలరేగారు. హెలిక్యాప్టర్‌ షాట్‌తో సిక్సర్‌ బాదిన హార్దిక్‌ను చాహర్‌ యార్కర్‌ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్‌ చాహర్‌ (0) నిష్క్రమించాడు. 19వ ఓవర్లో చాహర్‌ 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో పొలార్డ్‌ అన్ని బంతులూ ఎదుర్కొన్నా రెండు ఫోర్లు మాత్రమే బాదడంతో ముంబయి 149 పరుగులకే పరిమితమైంది.