చెలరేగిన పంత్‌ – ఎలిమినేటర్‌లో ఢిల్లీ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఢిల్లీ కేపిటల్స్‌ జట్టునే అదృష్టం వరించింది.ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో సాగిన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్‌లో అంతంత మాత్రం ప్రదర్శనతో సాధారణ స్కోరు నమోదు చేసిన రైజర్స్‌ బౌలింగ్‌లో మాత్రం ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది.

ఒక దశలో మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. కానీ రిషభ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆట గమనాన్ని మార్చేసింది. చివరకు మరో బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందుకొని ఢిల్లీ సంబరాలు చేసుకుంది. గత ఏడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ ఈసారి నాలుగో స్థానానికి పరిమితం కాగా 2012 తర్వాత ప్లే ఆఫ్‌ చేరి ఎలిమినేటర్‌లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టే లక్ష్యంతో రేపు వైజాగ్‌లోనే చెన్నైతో పోరు సిద్ధమైంది

.బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

మార్టిన్‌ గప్టిల్‌ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్‌ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు), కెప్టె న్‌ విలియమ్సన్‌ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా అమిత్‌ మిశ్రా (1/16) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయగా, కీమో పాల్‌కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (38 బంతు ల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌ క్యాపిటల్స్‌ను గెలిపించాయి.