వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
58
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతల శాతం కూడా పెరిగాయి.దీంతో ప్రజలు ఇళ్లలో నుండే బయటకి రావడానికి భయపడిపోతున్నారు. అదేవిధంగా వడగాల్పులు వీచే ప్రమాదముందని వాతావరణశాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. వేసవి కాలంలో చాలామంది వడదెబ్బ బారిన పడి తీవ్ర ఇబ్బంది పడుతుంటారు.

తగినన్నీ జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుండి దూరంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్ర మత్తం కావాల్సి ఉంది. తాగే నీరు, తినే ఆహారం, వేసుకునే దుస్తుల విషయంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచించారు.

ముందు జాగ్రత్తలు పాటిస్తే మేలు

రోజురోజుకీ భానుడు భగభగలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా కొల్లగొట్టడం వల్లే వర్షాలు కొరవడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ వేసవిలో భానుడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు అవసరం.శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఎండలో తిరుగడం వల్ల 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లో మృతిచెందే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఐదేళ్లలోపు, 60 ఏళ్ల పైబడ్డవారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణుల రీరంలో తేమశాతాన్ని కాపాడుకోకుంటే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది.రక్తకణాలు కుచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం మీద పడుతుంది.

వడదెబ్బ లక్షణాలు :

 • వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపించి బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
 • శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
 • ఒంట్లోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
 • జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరుగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
 • అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తల తిరుగడం, తలనొప్పి వస్తాయి.
 • మతి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మూత్రం పచ్చగా రావడం లాంటి లక్షణాలుంటాయి.

చికిత్స :

 • వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
 • బట్టలను వదులు చేసి 25 – 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో శరీరాన్ని తడుపాలి. దీని వల్ల శరీరంపై ఉండే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయి.
 • శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. గజ్జలు, చంకలు, మెడపై ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
 • వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు :

 • ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
 • ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి ఎండ తగులకుండా జాగ్రత్త పడాలి. టోపీ, గొడుగు, తలపాగా ధరించాలి.
 • ఇళ్లు, కార్యాలయాల్లో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
 • ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
 • నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
 • ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
 • కారం, మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
 • కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
 • వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి, తగ్గించాలి.
 • యోగా, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.