ఐపీఎల్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబయి ఇండియన్స్‌

0
38
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ముంబయి ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ సీజన్‌-12 ఫైనల్లో అడుగుపెట్టింది.చెన్నైతో చెపాక్‌ స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిం ది.సమష్టి ఆటతో మరోసారి లీగ్‌లో ఫైనల్‌కు చేరింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (29 బంతుల్లో 37 నా టౌట్‌; 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. రాహుల్‌ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది.

సూర్యకుమార్‌ (54 బంతుల్లో 71 నాటౌట్‌; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్‌ కిషన్‌ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 63 బంతుల్లో జోడించిన 80 పరుగులే ముంబై విజయానికి బాటలు వేశాయి.నెమ్మదైన పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టడి చేశారు.

రాహుల్‌ చహర్‌ తన తొలి బంతికే డు ప్లెసిస్‌ (6)ను ఔట్‌ చేయగా, రైనా (5) మరో స్పిన్నర్‌ జయంత్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన వాట్సన్‌ (10)ను కృనాల్‌ వెనక్కి పంపించాడు. ఆరు ఓవర్ల తర్వాత స్కోరు 32/3 కాగా, జట్టును ఆదుకునేందుకు విజయ్, రాయుడు ప్రయత్నించారు. అయితే ఈ భాగస్వామ్యం కూడా ఎక్కువ సేపు సాగలేదు.

వీరిద్దరు 38 బంతుల్లో 33 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ చహర్‌ టర్నింగ్‌ బంతిని ఆడలేక విజయ్‌ స్టంపౌటయ్యాడు.జయంత్‌ వేసిన 14వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్‌ కొట్టగా మలింగ ఓవర్లో ధోని వరుసగా కొట్టిన రెండు భారీ సిక్సర్లకు స్టేడియం హోరెత్తింది. అయితే బుమ్రా చివరి ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మరిన్ని మెరుపులకు అవకాశం లేకుండా పోయిం ది. ధోని, రాయుడు ఐదో వికెట్‌కు అభేద్యంగా 66 పరుగులు జత చేశారు.

advertisment

ముంబైకి కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే రోహిత్‌ (4)ను ఔట్‌ చేసి దీపక్‌ చహర్‌ చెన్నై కి శుభారంభం అందించాడు. డి కాక్‌ (8)ను హర్భజన్‌ వెనక్కి పంపించాడు. ఈ దశలో సూర్య కుమార్, ఇషాన్‌ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రశాంతంగా ఆడుతూ పరుగులు సాధించారు. 37 బంతుల్లో సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఇషాన్‌ను బౌల్డ్‌ చేసి తాహిర్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

తర్వాతి బంతికే కృనాల్‌ పాండ్యా (0)ను కూడా తాహిర్‌ ఔట్‌ చేయగా జడేజా వేసిన మరుసటి బంతికి స్లిప్‌లో సూర్యకుమార్‌ ఇచ్చిన క్యాచ్‌ను వాట్సన్‌ వదిలేయడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే సూర్యకుమార్, హార్దిక్‌ (13 నాటౌట్‌) కలిసి 9 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.