చంద్రుడిపై కుప్పకూలిన ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ఇజ్రాయెల్‌ ‘చిన్నదేశం – పెద్ద కలలు’ అనే పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ విఫలమైంది.చంద్రుని ఉపరితలంపై దిగేందుకు ఉద్దేశించిన బేరెషీట్‌ అంతరిక్ష నౌకలో చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఇది చంద్రుని ఉపరితలంపై మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది.

గురువారం చంద్రునిపై లాండింగ్‌ సమయంలో రోబోటిక్‌ లాండర్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక లోపంతోపాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బతిందని మిషన్‌ సిబ్బంది తెలిపారు. బుధవారం చంద్రుడి అతి సమీపంలోని దీర్ఝవృత్తాకార కక్ష్యలోకి ఇది ప్రవేశించింది. చంద్రుని ఉపరితలానికి 15-17 కిలోమీటర్ల దూరంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టి ఆ దేశానికి నిరాశను మిగిల్చింది.

ఇజ్రాయెల్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బేరెషీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. బేరెషీట్‌ అంటే బైబిల్‌ పదబంధంలో ‘ఆరంభంలో’ అని అర్థం. ఈ ప్రయోగం కోసం దాదాపు వంద మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. ప్రైవేట్‌ స్పేస్‌ అంకుర సంస్థ స్పేస్‌ఐఎల్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు.