చెలరేగిన చహర్‌ – కోల్‌కతాపై చెన్నై అలవోక విజయం

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
పేసర్‌ దీపక్‌ చహర్‌ చెలరేగిన వేళ కోల్‌కతాపై డిపెండింగ్‌ చాంపియన్‌ చెన్నై అలవోక విజయం సాధించింది.ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజ యం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది.

సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌(43నాటౌట్‌; 45 బంతుల్లో 3ఫోర్లు) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. డుప్లె సిస్‌కు తోడుగా వాట్సన్‌(17), రైనా(14), రాయుడు(21)లు తమ వంతు కృషి చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌ రెండు వికెట్లు తీయగా చావ్లా ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌ను తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది.

ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సీఎస్‌కే బౌలర్లు క్రమంతప్పకుండా వికెట్లు తీయడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. కేకేఆర్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ రాణా(0), నరైన్(6)‌, ఊతప్ప(8), దినేశ్‌ కార్తీక్‌(19), గిల్‌(10)లు తీవ్రంగా నిరాశపరిచారు.

రసెల్‌ (50 నాటౌట్‌; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగలిగింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ మూడు వికెట్లు సాధించగా, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రా న్‌ తాహీర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.