అమెరికాలో కాల్పులకు తెగబడ్డ దుండగుడు – ఇద్దరు మృతి

0
48
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అగ్రరాజ్యం అమెరికాలో దుండగులు రెచ్చిపోతున్నారు.తమ ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సియాటెల్‌ పట్టణంలో గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

అక్కడి పోలీసుల వివరాల ప్రకారం ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో నివసించే ఓ దుండగుడు బుధవారం తుపాకీతో వీధుల్లోకి ప్రవేశించాడు. కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను అపహరించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు అటుగా వస్తున్న మరో మెట్రో బస్సుపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది క్షణాల్లోనే తేరుకున్న డ్రైవర్‌ అక్కడి నుంచి బస్సును వేగంగా వేరే ప్రాంతానికి తరలించాడు. దీంతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

అనంతరం దుండగుడు మరో కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారు తీసుకొని పారిపోయే ప్రయత్నంలో నిందితుడు మరో వాహనాన్ని వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనంలోని వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలాడు. అనంతరం భారీ సంఖ్యలో పోలీసులు అతణ్ని వెంబడించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.