మంచు తుఫాన్‌ ధాటికి అమెరికాలో 1,339 విమానాల రద్దు

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
మంచు తుఫాన్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి.

స్కూళ్లు, వ్యాపారాలు మూతబడ్డాయి. ఇక కొన్ని చోట్ల హిమపాతంతో పాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలోనే ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి.

తాజా తుపానును ‘బాంబ్‌ తుపాను’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపి వేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించారు.