రాణించిన హ్యాండ్స్‌కోంబ్‌, ఖవాజా,టర్నర్‌ – నాలుగో వన్డేలో ఆసీస్‌ గెలుపు

0
7
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి భారత్‌ విధించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో తమ వన్డే చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని ఛేధించడం ఇదే ప్రథమం.ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అధిక స్కోర్లు నమోదవ్వగా ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించి సిరీస్‌ 2-2తో సమం చేసింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. రోహిత్‌ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కమిన్స్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది.

పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం నమోదు చేయగా, ఉస్మాన్‌ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆస్టన్‌ టర్నర్‌ (43 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో వన్డే బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది.

ఆసీస్‌ జట్టు విన్నర్‌ టర్నర్‌ : ఆస్టన్‌ టర్నర్‌ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి ఆసీస్‌ 14 ఓవర్లలో 130 పరుగులు చేయాల్సి ఉంది. సొంతగడ్డపై భారత బౌలింగ్‌ బలగాన్ని బట్టి చూస్తే ప్రత్యర్థికి ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యం! కానీ టర్నర్‌ దానిని చేసి చూపించాడు. తానొక్కడే 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

ప్రతీ బౌలర్‌పై అతను విరుచుకుపడ్డ తీరు అభినందనీయం. కుల్దీప్‌ బౌలింగ్‌ 2 ఫోర్లు, సిక్సర్‌తో మొదలు పెట్టి చహల్‌ బౌలింగ్‌ లో మరో భారీ సిక్సర్‌తో జోరును కొనసాగించాడు. భువనేశ్వర్‌ వేసిన 45వ ఓవర్లో టర్నర్‌ 2 సిక్సర్లు, ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ ఆసీస్‌ వైపు మొగ్గింది.

advertisment

బుమ్రా బౌలింగ్‌లో పూర్తిగా కుడి వైపునకు జరిగి ఫైన్‌ లెగ్‌ మీదుగా టర్నర్‌ కొట్టిన సిక్సర్‌ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్‌. భువీ తర్వాతి ఓవర్లో అతను మళ్లీ 6, 4 బాదగా క్యారీ మరో ఫోర్‌తో దానిని కొనసాగించడంతో ఆసీస్‌ విజయానికి అడ్డు లేకుండా పోయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 38 పరుగులిచ్చాడు.