తెలంగాణలో ఏప్రిల్‌ నుండి రూ.2 వేలు పెన్షన్‌ – కేటీఆర్‌ వెల్లడి

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – వనపర్తి
ఏప్రిల్‌ మాసం నుంచి తెలంగాణలో పెన్షన్‌ రూ.2,016లు అందజేస్తామని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెల్లడించారు. వనపర్తిలో నిర్వహించిన తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ శనివారం మాట్లాడారు.57 ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రెండో హరిత విప్లవానికి కేసీఆర్‌ నాంది పలికారని చెప్పారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనేది ఒకనాటి ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని చాటింది. ఇప్పుడా పరిస్థితి మారింది. కేసీఆర్‌ స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కేసీఆర్‌ ఆలోచనలే నేడు చాలా మంది ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు.

నాగర్‌కర్నూలులో 4.98 లక్షల మందికి రైతు బంధు అమలవుతోంది. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మితో కేసీఆర్‌ మేన మామ అయ్యారు. కేసీఆర్‌ పాలనలో చెరువులన్నీ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. పాలమూరు పచ్చగా పండుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి. పాలమూరులోని ప్రతి ఎకరాకు నీరందిస్తామని కేటీఆర్‌ అన్నారు.తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మోదీ పట్టించుకోలేదు.

ఏ సర్వే చూసినా ఎన్టీయేకు 150 నుంచి 160 స్థానాలు దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. దిల్లీ గద్దెమీద ఎవరుంటే వారికి రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి. 16 స్థానాలు గెలిస్తే కేంద్రంలో తెరాస కీలకం కానుంది. కొల్లాపూర్‌లో కూడా మెజార్టీ తీసుకురావాలి. ఈ సారి 8 లక్షల 75వేల ఓట్లు సాధించాలి. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు. తెరాస కార్యకర్తల పోలింగ్‌ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.