మహా శివరాత్రి పండుగ ప్రాముఖ్యత ఇదే…! శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ?    

0
109
advertisment

మనఛానల్ న్యూస్ – స్పెషల్ డెస్క్
ప్రపంచంలోని హిందువులందరూ జరుపుకొనే పండుగలలో అతిముఖ్యమైనది మహాశివరాత్రి. ఈసందర్భంగా భక్తులు శివుడుని భక్తితో కొలుస్తారు. మహా శివరాత్రి అంటే శివ, దేవేరి పార్వతిల వివాహం జరిగిన రోజు. మహా
శివరాత్రి పండుగను ‘శివరాత్రి’ అని కూడా ప్రముఖంగా పిలుస్తారు.

ఇంకా ఈ పండుగను శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా ఆయా ప్రాంతాలలో పిలుచుకొంటారు. శివరాత్రి అంటే ‘శివుడి యొక్క మహారాత్రి’, అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను ఈ పండుగ సూచిస్తుందని అంటుంటారు.

మహా శివరాత్రి  ఎప్పుడు జరుపుకొంటారు..??
హిందువుల పండుగులలో అత్యంత ప్రాశస్త్యమైన మహా శివరాత్రి పండుగను ఏటా చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకొంటారు. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది.

శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి.ప్రతి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా హిందువుల భావన.

శివరాత్రి పండుగ నాడు భక్తులు ఏమి చేస్తారు.?
శివ రాత్రి పండుగ నాడు భక్తులు ముఖ్యంగా బిల్వ ఆకులు శంబో శంకరుడైన శివుడికి సమర్పిస్తారు. శివభక్తులు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . ఈ కార్యక్రమాన్ని ఎంతో నిష్టతో చేపడుతారు.

advertisment

రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శైవక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ” మంత్రాన్ని ఎంతో పవిత్రంగా జపిస్తారు.

ఎందుకిలా చేస్తారు..??
మహా శివరాత్రి పండుగను ఎంతో నిష్టతో చేయడానికి కారణాలు ఉన్నాయి. తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసాలను క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క పరమార్థాన్ని పొందడానికి తనకున్న కోరికలను తీర్చుకోవడానికి మరీ ముఖ్యంగా ముక్తి పొందడానికి మహా శివరాత్రి పూజలు నిర్వహిస్తారని విశ్వాసం.

ఈ రోజు, ఉత్తర ధ్రువంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.

మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.

మనఛానల్ భక్తులకు మహా శివరాత్రి శుభాకాంక్షలతో… 

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ?   

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
 శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

1. ఉపవాసం

 శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన

అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద ‘జీవారాధానే శివారాధాన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

3. మౌనవ్రతం

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర – నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

 4. అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5. జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

6. మంత్ర జపం

శివరాత్రి మొత్తం శివనామంతో, *ఓం నమః శివాయ* అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.