మసూద్‌ అజార్‌ తమదేశంలోనే ఉన్నాడంటూ ప్రకటించిన పాక్‌

0
201

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి,జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ తమదేశంలో ఉన్నట్లు పాకిస్థాన్‌ అంగీకరించింది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ అతడు (మసూద్‌) పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు.మసూద్‌ను పాక్‌ అరెస్ట్‌ చేయాలంటే ముందుగా భారత్‌ మాకు సరైన ఆధారాలు అందించాలి. అవి పాక్‌ న్యాయస్థానాలకు ఆమోదయోగ్యం కావాలని ఖురేషి చెప్పారు.

ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. భారత్‌ వద్ద తగిన ఆధారాలు ఉంటే దయచేసి కూర్చుని చర్చించుకుందాం. చర్చలను ప్రారంభించండి. మేం సంసిద్ధంగా ఉన్నామని ఖురేషి పేర్కొన్నారు.

40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఎప్పట్నుంచో మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ కోరుతోంది. తాజాగా మసూద్‌‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మరోసారి ప్రతిపాదించాయి.