
మనఛానల్ న్యూస్ – విశాఖపట్నం
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలం డి.అగ్రహారం వద్ద మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డి.అగ్రహారానికి చెందిన ఆర్.నవీన్(18), కె. వరప్రసాద్ (16), కార్తీక్ (16) ద్విచక్ర వాహనంపై యలమంచిలి వెళ్తున్నారు. అగ్రహారం కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
వరప్రసాద్ మృతదేహాన్ని లారీ ఈడ్చుకెళ్లగా యలమంచిలి మండలం పులపర్తి వద్ద లభ్యమైంది. ఈ ప్రమాద ఘటనతో జాతీ య రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు.