గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన 1.5 కోట్లమంది భక్తులు

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
వసంత పంచమి పర్వదినం సందర్భంగా పవిత్ర స్నానాలను ఆచరించేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అలహాబాద్‌లోని గంగానదికి భక్తులు పోటెత్తారు. హర్‌హర్ గంగే.. గంగా మాతాకీ జై.. అనే నినాదాలతో కుంభమేళా పరిసరాలు దద్దరిల్లాయి. గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున నుంచే భక్తులు స్నాన ఘట్టాలకు బారులు తీరారు.

పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఈ ఒక్క రోజే సుమారు 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యోదయానికి ముందే 50 లక్షల మంది భక్తులు గంగలో మునకేసినట్లు చెప్పారు. జనవరి 15న మకర సంక్రాంతి పర్వ దినం సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు కుంభ మేళా అధికారి విజయ్‌కిరణ్ ఆనంద్ చెప్పారు.

ప్రస్తుత కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్‌ను వసంత పంచమి సందర్భంగా చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్నానాలు చేసేందుకు, తిరిగి వెళ్లేందుకు వేర్వేరు దారులను ఏర్పాటు చేసి ఎక్కడా తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసు కుంది. అత్యధికులు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత స్నానాలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా అధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అభినందించారు.

మరోవైపు గంగానదిలో 1.5 కోట్ల మంది స్నానాలు చేశారని ప్రభుత్వం చెబుతుందని, ఏ ప్రాతిపదికన మీరు ఈ ప్రకటన చేశారని యూపీ మంత్రి, ఎస్బీ ఎస్పీ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ ప్రశ్నించారు. భక్తులు, పర్యాటకులు ఏ మార్గాల ద్వారా కుంభమేళాకు చేరుకున్నారు. ఎంత మంది వచ్చారు? అనే వివరాలు మీ వద్ద ఉన్నాయా? అని నిలదీశారు.