కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేక చంద్రబాబుకు వణుకు – గుంటూరు సభలో ఎపి సి.ఎం.పై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోది

0
325

మనఛానల్ న్యూస్ – గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి మయం అయిందని, కేంద్రం రాష్ట్రానికి వివిధ పథకాల కింద రూ.3లక్షల కోట్లు నిధులు ఇస్తే వాటిని దుర్వినియోగం చేసి, దానికి సరైన లెక్కలు చెప్పలేక తిప్పలు పడుతున్నారని, ఇప్పుడు చంద్రబాబును లెక్కలు అడుగుతుంటే వణుకు పుట్టి తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ప్రధాని నరేంద్రమోది విమర్శించారు.

ఆదివారం ఉదయం గుంటూరు లో బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సత్యమేయ జయితే బహిరంగసభలో ప్రదాని నరేంద్రమోది పాల్గోని ప్రసంగించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్రమోది మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎపి ప్రత్యేక హోదా కి మించిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పామని, దానిని ఎపి సి.ఎం. చంద్రబాబు ఒప్పుకొన్నారని, ఇందుకు అసెంబ్లీలో తమకు ధన్యవాదాలు తెలిపారని అన్నారు.

చెప్పిన దానికి అనుగుణంగా తమ ప్రభుత్వం ఏపికి దాదపు రూ.3లక్షలు కోట్ల నిధులు విడుదల చేసిందని అయితే చంద్రబాబు ఆ నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని, తాము ఇంతవరకు ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా తాత్సర్యం చేస్తున్నారని, దానికి సరైన లెక్కలు చెప్పితే నిధులు విడుదల చేస్తామని, అయితే బాబుకు ఇలా లెక్కలు చెప్పకుండ తప్పించుకోవడం ముందు నుంచి అలవాటు అని ప్రధాని నరేంద్ర మోది విమర్శించారు.

కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడానికి బాబు భయపడి వణికిపోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఏపికి తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసి ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపిలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు.ఈ అవినీతి ప్రభుత్వానికి ముగింపు పలికే రోజు దగ్గర పడిందని ప్రధాని అన్నారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ తో కలిసి ఎన్.టి.ఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్.టి.ఆర్ వారసుడుగా చెప్పే చంద్రబాబు ఆయన కలలను, అశయాలను తుంగలో తొక్కేశారని ప్రధాని దుయ్యపట్టారు. ఆంధ్ర ప్రజలు అన్నా, వారి సాంప్రదాయాలన్న తమకు ఎంతో గౌరమం,ఇష్టమని ప్రధాని అన్నారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని వివరించారు.