‘‘మోడీ గో బ్యాక్‌’’ అంటూ మదనపల్లిలో సిపిఎం నాయకుల రాస్తారోకో

0
57
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మదనపల్లెలో సిపిఎం ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ అంటూ రాస్తారోకో నిర్వహించారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ముందు కదిరి రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించారు. మోడీ గోబ్యాక్, హోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి రావడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి సీపీఎం, జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ఏపీకి అన్యాయం చేసి ఎలా ఇక్కడికి వస్తారు? అని రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మోడీ వైఖరి కక్షపూరితంగా ఉందని వివరించారు. చిప్పడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ఏ మొహంతో పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో మోడీ పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు మోడీ సభ జరిగే గుంటూరులో కూడా సభను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు రాష్ట్రంలో ఎవరి స్థాయిలో వారు మోడీ పర్య టనను నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో నాలుగేళ్లు బిజెపితో అంటకాగిన తెలుగుదేశానికి రాష్ట్రానికి జరిగిన ద్రోహంలో భాగస్వామ్యం ఉందని వివరించారు.

రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివా సులు, ఎన్.చంద్ర, టి.హరీంద్రనాథ్ శర్మ, పి.నాగరాజు, పి.వెంకట్రమణ, ఎస్.శంకర, ఎం.సిద్దార్థ, భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.