రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం – సిరీస్‌ సమం

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆంక్లాండ్‌లో శుక్రవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్‌ ఈ మ్యాచ్‌లో పుంజుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు.

తొలి మ్యాచ్‌ హీరో సెయ్‌ఫెర్ట్‌ (12), మున్రో (12), విలియమ్ సన్‌ (20),మిచెల్‌ (1)లు విఫలం కావడంతో కివీస్‌ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్‌ (50 పరుగులు 4 సిక్సర్లు, ఒక ఫోర్‌), రాస్‌ టేలర్‌ (42 పరుగులు 3 ఫోర్లు) 5వ వికెట్‌కు 77 పరుగులు జతచేశారు.అయితే చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (50 పరుగులు, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (30 పరుగులు 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరిగినప్పటికీ రిషబ్‌ పంత్‌ (40 పరుగులు 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించడంతో భారత్‌ 18.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

భారత బౌలర్లలో కృనాల్‌ పాండ్యా 3, ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టారు. కృనాల్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారం దక్కింది. ఇక నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌ ఆదివారం హామిలటన్‌లో జరుగనున్నది.