తొలి టీ20లో భారత్‌పై న్యూజిలాండ్‌ ఘనవిజయం

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ టీ20 సిరీస్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ 80 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుచేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.220 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో రోహిత్ సేన తడబడింది.

భారత బ్యాట్స్‌మెన్‌ పరుగుల విషయం పక్కకు పెడితే కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడ్డారు. దీంతో 19.2ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సీనియర్‌ ఆటగాడు ధోని (39), ధావన్‌(29), విజయ్‌ శంకర్‌(27), కృనాల్‌(20)లు రాణించడంతో టీమిండియా కనీస గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.

కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, ఫెర్గుసన్‌, సాన్‌ట్నర్, ఇష్‌ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టగా మిచెల్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు టీ20లో తమ సత్తా ఏంటో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతీ బ్యాట్స్‌మన్‌ తమ వంతు కృషిగా పరుగులు రాబట్టారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడును అడ్డుకోలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు.

కివీస్‌ ఓపెనర్‌ సీఫ్రెట్‌ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయగా కొలిన్‌ మున్రో(34: 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విలియమ్సన్‌ (34: 22 బంతుల్లో 3 సిక్సర్లు) భారత బౌలర్లను ఆడుకున్నారు. చివర్లో స్కాట్‌ కుగ్లీన్ 7 బంతుల్లో 20 పరుగులు 3 ఫోర్లు, 1 సిక్స్‌) చేయడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.