స్టాక్‌మార్కెట్లలో కొనసాగిన లాభాల జోష్‌

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
రేపు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కళకళలాడాయి.రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ రైతులకు, మధ్యతరగతి ప్రజలకు సానుకూలంగా ఉండనున్నట్లు రాష్ట్రపతి సంకేతాలివ్వడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు జోరుగా సాగాయి. అటు అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ‌ వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది.

దీంతో ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సూచీలు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ను భారీ లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ 36వేల మార్క్‌ను దాటగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 10,800 పైన స్థిరపడింది.అంతర్జాతీయ సానుకూలతలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది.

అన్ని రంగాల షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఏ దశలోనూ వెనక్కి తగ్గని సూచీలు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 665 పాయింట్లు ఎగబాకి 36,257 వద్ద స్థిరపడగా నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 10,831 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.13గా కొనసాగుతోంది.