బుచ్చిరెడ్డిగారిపల్లిలో అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

0
53
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లిలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలు మండలపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.ఢిల్లీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ సంబరాలకు తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి సునీల్‌ కుమార్‌ రెడ్డి, ఎంపిపి ఖలీల్‌ అహ్మద్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ రమేష్‌ రెడ్డి, తహశీల్ధార్‌ బలరాముడు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డిశేఖర్‌, ఎంపిటిసి లక్ష్మీసంతోష్‌, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇందులో భాగంగా గుమ్మసముద్రం చెరువులో నిర్వహించిన కోలాటాలు, గాలిపటాలు, భోగిమంటలు తదితర సాంస్కృతిక కార్య క్రమాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్వదినాలు మన సంస్కృతికి, సాంప్రదా యాలకు నిదర్శనాలన్నారు. వాటిని ఆనవాయితీగా మనం నిర్వహించుకోవాలన్నారు.

ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు పల్లెల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. భోగి మంటలు, పశువులను బెదిరించడం, కోడి పందేలు, మహిళలు వివిధ రకాల ముగ్గులు రంగులతో వేస్తారన్నారు. వివిధ ప్రాంతాల్లో విధుల రీత్యా స్థిరపడ్డ వారంతా ఈ పర్వదినానికి తమ సొంత ఊర్లకు వచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.