ప్లేస్టోర్‌ నుండి 85 యాప్‌లను తొలగించిన గూగుల్‌

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – టెక్నాలజీ డెస్క్‌
గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుండి మొబైల్‌లో డేటా భద్రతకు హాని కలిగించే 85 రకాల యాప్‌లను తొలిగిస్తున్నట్లు తెలిపింది.గేమ్‌, టీవీ, రిమోట్‌ కంట్రోల్‌ సిమ్యులేటర్‌ కేటగిరీలో ఉండే యాడ్‌వేర్‌ (adware) ఫ్యామిలీకి చెందిన ఈ యాప్‌ల వల్ల డేటా భద్రతకు భంగం కలుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో ఈ యాప్‌లను గూగుల్‌ తొలగించింది.

‘ఈ యాడ్‌వేర్‌ ద్వారా మొబైల్‌లో ప్రకటనలు ఫుల్‌ స్క్రీన్‌లో కన్పిస్తాయి. ఆ సమయంలో ఈ యాప్‌లు ప్రకటన కింద దాగి మొబైల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తాయి. వీటి వల్ల ఫోన్‌ డేటా భద్రతకు భంగం కలుగుతుంది’ అని ట్రెండ్‌ మైక్రో ఇటీవల తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో 90లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. గూగుల్‌ తొలగించిన 85 యాప్‌లలో ‘Easy Universal TV Remote’ యాప్‌ ఒకటి.

దీన్ని అత్యధికంగా 50 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిసింది.ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపెన్‌ చేసిన తర్వాత డిస్‌ప్లే పైన ఫుల్‌ స్క్రీన్‌ పాప్‌-అప్‌ బాక్స్‌ వస్తుంది. దానిపై continue అనే బటన్‌ను నొక్కితే మళ్లీ యాడ్‌తో కొత్త పేజీ వస్తుంది. అలా చాలా సార్లు continue బటన్‌ వచ్చిన తర్వాత యాప్‌ క్రాష్ అవుతుంది.

అయితే మనం ఈ యాడ్‌లను చూస్తున్న సమయంలో సదరు యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. మొబైల్‌ స్క్రీన్‌ అన్‌లాకింగ్‌ యాక్షన్‌ను తస్కరించి మనం ఫోన్‌ను లాక్‌ చేసిన ప్రతిసారీ ప్రకటనలు చూపిస్తూ ఉంటుంది. వీటి వల్ల మొబైల్‌ డేటాకు ప్రమాదమని అధ్యయనాలు చెప్పడంతో గూగుల్‌ వీటిని తొలగించింది.